Tuesday, March 1, 2011

ఎంత పని చేస్తివిరో రామలింగరాజా!!

రూపవతి, గుణవతి, శీలవతి అయిన భానుమతిని పెళ్ళిచూపులు చూడటానికి తిరుపతి బయలుదేరాడు సాఫ్ట్‍వేర్ ఇంజనీర్ అయిన రఘుపతి. హడావుడిగా పెళ్ళిచూపులు ఏర్పాటు చేసి, తాను ఉద్యోగంలో చేరిన తరువాత మొదటిసారి రెండో క్లాసులో ప్రయాణించేలా చేసిన పేరయ్యను మనసులో తిట్టుకుంటూ రైలెక్కాడు. రైలులో పిజ్జాలూ, బర్గర్లు దొరకవన్న విషయం స్ఫురించి, కనీసం మినరల్ వాటర్ అయినా కొనుక్కుందామని ప్లాట్‍ఫాం పైకి వచ్చాడు.
వేళ కాని వేళలో వచ్చే Windows error శబ్దంలా కర్ణకఠోరంగా వినపడిన పిల్లవాడి ఏడుపు విని అటువైపు దృష్టి సారించాడు. పిల్లవాడిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్న యువతిని చూడగానే Youtube వీడియోలా అతని ఫ్లాష్‍బ్యాక్ లోడ్ అవ్వడం మొదలు పెట్టింది. అది పూర్తి అయ్యేవరకు అక్కడే ఉంటే రైలు తప్పిపోయే ప్రమాదం ఉందని గ్రహించి, రైలెక్కి గతంలోకి వెళ్ళాడు.
అవి అతను ఉద్యోగంలో కొత్తగా చేరిన రోజులు. Broadband ఇంటర్నెట్ లాగా చురుగ్గా ఉండేవాడు. అయిదంకెల జీతాన్ని, అదుపులేని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించేవాడు. అలా ఉండగా ఒకరోజు పని ముగించుకుని ఇంటికి చేరుకున్న రఘుపతితో యధావిధిగా పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చారు తల్లిదండ్రులు.
రఘుపతి "లెట్ మీ ఎంజాయ్ డాడీ!!" అంటూ తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అతని తల్లి "పాతికేళ్ళు మీద పడ్డాయి. ఎంతకాలం ఇలా ఒంటికాయ సొంటికొమ్ము జీవితం...." అంటూ నచ్చచెప్పబోయింది. రఘుపతి ఇక తప్పేది లేక "సరే మీ ఇష్టం. ఎలాగో పెళ్ళికి ముందు ట్రైనింగూ, పెళ్ళి తరువాత ఫైరింగూ ఉండదంటున్నారు కాబట్టి కనీసం ట్రయల్ అయినా దొరికేటట్లు చూడండి." వెంటనే అతని తండ్రి " అరిగిపోయిన చెప్పు అప్పు తెచ్చి మరీ కొడతాను, ఇలాంటి పైత్యపు వాగుడు వాగావంటే.." అంటూ మండిపడడంతో ఇక వారితో వాదించడం ప్రమాదమని గ్రహించి, భవిష్యత్తులో భార్యను అప్‍గ్రేడ్ చేసుకోవడం అసాధ్యమని స్ఫురించి, తనకు కావలసిన లక్షణాలను ముందుగానే గుర్తించి పెళ్ళికూతురికి ఒక Configuration ను తయారుచేసాడు.
"అయితే సరే! నాకు కాబోయే భార్యకు కావలసిన Configuration చెబుతా వినండి."
అతని తండ్రి దానికి "ఏమిటా బోడి Configuration??" అన్నాడు. అతను వెంటనే జేబులోనుంచి ఒక printout తీసి చదవడం మొదలు పెట్టాడు. "వీకీపీడియా లాంటి తెలివితేటలు, గూగుల్ లాంటి చురుకుదనం, ఆర్కుట్ లాంటి కలుపుగోలుతనం, Apple Mac లాంటి అందం, Touch Screen లాంటి సున్నితత్త్వం ..." అంటూ చదువుతుంటే తల్లిదండ్రులు విస్తుపోయారు. వీడి మెదడుకు ఏదో వైరస్ సోకిందని భయపడ్డారు.
వీడి గొంతెమ్మ కోర్కెలను తీర్చే సామర్ధ్యం అల్లాటప్పా పేరయ్యలకు ఉండదని ఖర్చు ఎక్కువైనా హైటెక్ పేరయ్యకు ఈ పని అప్పగించారు. అతను గూగుల్ లో ముల్లోకాలు (కోస్తా, తెలంగాణా, రాయలసీమ) గాలించి కొన్ని సంబంధాలను తెచ్చాడు. వాటిలో రఘుపతి చూసిన మొదటి సంబంధం పద్మావతి. పెళ్ళిచూపుల్లో ఇరుపక్షాల పెద్దలకీ అన్ని విషయాలూ నచ్చాయి. పద్మావతిని ఏకాంతంగా మాట్లాడేందుకు తీసుకెళ్ళిన రఘుపతి తనతో ఛాటింగ్ కు రమ్మని ఆహ్వానించాడు. కానీ ఆమెకు e-mail id లేదని తెలియడంతో అగ్గి మీద గుగ్గిలంలా మండిపడి సంబంధాన్ని నిరాకరించాడు. ఇందాక ప్లాట్‍ఫాం మీద చంటి పిల్లాడితో కనిపించిన యువతి ఈ పద్మావతేనని గుర్తు చేసుకుంటూ వర్తమానంలోకి వచ్చాడు.
ఆ రోజు పద్మావతితో మొదలైన రఘుపతి పెళ్ళిచూపుల మహాప్రస్థానం నేటి వరకూ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఎంతమందిని చూసినా ఏదో ఒక బగ్ పట్టుకుని నిరాకరించడం అతనికి పరిపాటి అయిపోయింది. ఇలా ఎన్ని సంబంధాలు చూసాడంటే కొన్ని సార్లు పెళ్ళిచూపులకు వెళ్ళిన తరువాత ఆ సంబంధం ఇదివరకు చూసినదే అని తెలిసి వెనుదిరగవలసి వచ్చేది. ఇక ఈ రోజైనా తన configuration ఉన్న పిల్ల దొరకాలని ఆ ఏడుకొండల వాడిని స్మరిస్తూ తిరుపతిలో అడుగుపెట్టాడు.
యధావిధిగా స్వాగత సత్కారాల తర్వాత పెళ్ళిచూపుల తతంగం ప్రారంభం అయ్యింది. గతంలో జరిగిన పెళ్ళిచూపుల్లో గడించిన అనుభవసారాన్నంతా రంగరించి ఒక ప్రశ్నావళిని తయారుచేసుకున్నాడు రఘుపతి. అందులో మొదటి ప్రశ్నను పెళ్ళికూతురు మీదకు నేరుగా సంధించాడు. "భార్యాభర్తల మధ్య దాంపత్యం ఎలా ఉండాలి?" దానికి ఆమె ఏమాత్రం తడబడకుండా "భార్యాభర్తల మధ్య సంబంధం RAMకి హార్డ్‍డిస్క్‍కీ ఉన్నట్లు అన్యోన్యంగా ఉండాలే కానీ డెస్క్‍టాప్ - పెన్‍డ్రైవ్ లాగా ఉండకూడదు." అని సమాధానం చెప్పింది భానుమతి. ఈ సమాధనం విన్న రఘుపతి ముఖం19" Monitor లాగా ఆనందంతో వెలిగిపోయింది. 3D గ్రాఫిక్స్‍తో creative woofers లోని మంగళవాయిద్యాలతో భానుమతితో తన పెళ్ళి సీను కళ్ళముందు కదలాడసాగింది. డ్యుయెట్‍కు ఇదే తరుణమని OnSiteకి వెళ్ళబోతుండగా ఇంగ్లీషు సరిగా మాట్లాడడం రాని పిల్ల ఇంత చక్కగా computer terminology ఎలా వాడిందా అని అనుమానం కలిగింది. దాని వెనుక పేరయ్య హస్తం ఉందని గ్రహించాడు. తన చేయి ఎప్పుడూ పైనే ఉండదనీ, స్టాక్ మార్కెట్ లా పడిపోవచ్చనీ ఊహించలేని రఘుపతి ఈ సంబంధాన్నీ నిరాకరించాడు.
ఆ పిమ్మట ఆర్ధిక మాంద్యం (Recession) రావడమూ, రఘుపతికి పెళ్ళివయసు దాటిపోవడం ఏకకాలంలో జరిగడంతో deadline దాటిన ప్రాజెక్టులా రఘుపతి మార్కెట్ విలువ పడిపోయింది. ఇక configuration విషయంలో రాజీకి సిద్ధపడినా పిల్లనివ్వడానికి ఎవరూ అంగీకరించకపోవడంతో రఘుపతి వాళ్ళ తల్లిదండ్రుల గుండెల మీద సెకండ్ హ్యాండ్ P 2 సిస్టం లా తయారయ్యాడు
ఇంతలో ఇంటర్నెట్ లో వెతుకుతున్న ఫైల్ డెస్క్‍టాప్ మీద దొరికినట్లు తనకు కావలసిన లక్షణాలు గల ఇందుమతి ఎదురింట్లో ఎదురయ్యింది. నేరుగా వెళితే అంకుల్ అంటుందేమో అన్న భయంతో వాళ్ళ తల్లిదండ్రులవైపు నుంచి నరుక్కురావడం మొదలుపెట్టాడు. ససేమిరా అంటున్న ఇందుమతి తండ్రి శ్రీపతిని కాళ్ళావేళ్ళా పడి, ఒబామా లా ఆశ చూపించి ఎట్టకేలకు పెళ్ళికి ఒప్పించాడు.
పెళ్ళి కుదిరిందన్న ఆనందంలో మదర్ బోర్డంత మంటేసి, కీ బోర్డంత పీటేసి, Apple iphone రిలీజ్ అంత వైభవంగా తన పెళ్ళి జరుగుతున్నట్లు Adobe Photoshopలో కలలు కనడం మొదలుపెట్టాడు. అయితే నిశ్చితార్ధం కుదిరాక సత్యం కుంభకోణం బయటపడడంతో P 2 సిస్టం మీద వైరస్ ఎటాక్ అయినట్లు తయారయింది అతని పరిస్థితి. Microsoft కంటే సత్యం లో పనిచేయటమే గొప్పని భావించే సగటు సిటీ వాసుడు శ్రీపతికి సాఫ్ట్‍వేర్ మీద అభిప్రాయం చెడి, రఘుపతి కన్నా ఏ గుడి పంతులకో, బడి పంతులకో ఇచ్చి పెళ్ళి చేయటం మేలని భావించి పెళ్ళిని Preempt చేసాడు. ఎంత పని చేస్తివిరో రామలింగరాజా... అనుకుంటూ రఘుపతి కూలబడ్డాడు.

- చైతన్య, హరిప్రసాద్

2 comments:

  1. Good to see a post. But having read it already, I'm in no mood to read it again. Unfortunately.

    ReplyDelete
  2. Brings back memories...

    ReplyDelete