Thursday, April 15, 2010

all of a sudden గా రాయాలనిపించింది ఇలా...!!!

నా జీవితం లో మరిచిపోలేనివి నేను బెంగళూరులో చదువుకున్న రోజులు. వంద సంవత్సరాల చరిత్ర ఉన్న కాలేజి లోఅనూహ్యం గా చేరాను. అక్కడికి వచ్చే వాళ్ళంతా పుస్తకాల పురుగులే, అలాంటి వాళ్ళ మధ్య నేను ఏమయి పోతానో అనుకుంటూ అడుగు పెట్టాను. నా అంచనాలు తారుమారు అయ్యి ఆ రెండు సంవత్సరాలూ ప్రతి రోజు పండుగ లా గడిచాయి.. చదువు మా జీవితం లో కేవలం ఒక (చిన్న) భాగం మాత్రమే అయ్యింది... దానికి కారణం... మా క్లాస్ లోని తెలుగుమూక (వేరే పదం దొరక్క కాదు. మా వాళ్ళు నిజం గానే కోతుల మూక,ఎక్స్ట్రా గాళ్ళతో కలిపిన క్రికెట్ టీం సైజు) ఆటలు, పాటలు, జోకులు, సరదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అర్థ రాత్రి దాక Lab లో సినిమాలు... షికార్లు.. నిజంగా.. Golden period….అనేది చాలా చిన్న పదం అవుతుంది... అలాంటి నా కాలేజి రోజుల్లోని ఈ అనుభవం మీ కోసం...

మా బ్యాచ్ లో చాలా మందికి కామన్ గా వున్న ప్రాబ్లం గర్ల్ ఫ్రెండ్ ... కామన్ అంటున్నాడు... ఒకటే గర్ల్ ఫ్రెండా.. అని అనుమానం గా చూడకండి... గర్ల్ ఫ్రెండ్ వుంటే ప్రోబ్లమ్స్ అనే వాడిని... గర్ల్ ఫ్రెండ్ లేదన్నదే మా బాధ.. ఎంత కరువు లోవుండే వాళ్ళమంటే C గ్రేడ్ అమ్మాయిలకు కూడా డిస్టింక్షన్ వేసే వాళ్ళం.... దానికి తోడు మేమంతా నక్క తోక మీద బ్రేక్ డాన్సు చేసామా అనిపించేలా... మా క్లాసు లో ఒక్క పోరి కూడా లేదు... వున్న ఇద్దరిలో ఒకరు ఆంటీ.. ఒకరు ఆంటీలాంటి...

మీకు ఒక (ఈ కధకు ) ముఖ్యమైన వ్యక్తి ని పరిచయం చేస్తాను. (background లో TV9 మ్యూజిక్ మీరు
వేసుకోండి...) పేరు నవీన్.. చూడటానికి బాగానే వున్నా ఏ అమ్మాయి కంటికీ (ఇప్పటి దాకా) అలా కనపడలేదు పాపం... మీకు కంప్యూటర్ సైన్స్ లో “విందు చేస్తున్న వేదాంతులు” (dining philosophers) గురించి తెలుసా?? అందులోఒక వేదాంతి వీడు... తినడం,ఆలోచించడం వీడి జీవితం లోని ముఖ్యమైన కార్యక్రమాలు. ad break లో గర్ల్ ఫ్రెండ్ దొరకలేదు అని భాధ పడటం. వాడి జీవితంలోని ఎన్నో ప్రేమకథల్లోంచి మచ్చుకు ఒకటి వాడి మాటల్లోనే...
"నేను ఇంజనీరింగ్ లో వుండగా… డ్రాయింగ్ క్లాస్ జరుగుతోంది... ఒక అందమైన అమ్మాయి.. నా పక్క టేబుల్ దగ్గరకు వచ్చింది... చూపు చూపు కలిసింది.. తన పెదవులపై చిన్న నవ్వు మెరిసింది... నేను కూడా చిన్న నవ్వు (ఓ 20 బయటపెట్టి) వదిలా.. నాకు దగ్గర గా వచ్చింది... నా గుండె వేగం గా కొట్టుకోవడం మొదలయింది... వచ్చి మీ దగ్గర eraser వుందా అంది... నేను ప్రేమగా.. లేదు అన్నాను... తను వెళ్ళిపోయింది...."
"ఆ తరువాత...."
"అంతే అయిపొయింది స్టొరీ..."
(అవాక్కయ్యారా..?? in front crocodile festival... గిన్నీసు రికార్డులను తల దన్నే ఇలాంటి అతి చిన్న love స్టోరీస్ మా వాడి దగ్గర చాలానే వున్నాయి..)
ఒక చాలా అందమైన.... వద్దులే.... ఒక అందమైన.... సర్లే...... ఒక అమ్మాయిని ప్రేమలో పడేలా చెయ్యటం.. మా వాడి జీవితాశయం. అదీ క్లుప్తం గా మా నవీన్ గాడి గా(భా)ధ. అలా ఎడారి లాంటి మా నవీన్ జీవితం లో సింధు అనే సునామీ వస్తుందని ఎవరు ఊహించలేదు... (సింధు కూడా...!!!)

ఒక రోజు క్లాస్ అయిపోయాక ల్యాబ్ కి వెళ్లి (ఎప్పటి లాగే) ఆలోచిస్తూ.. ఆర్కుట్ తెరిచాడు.. ఇవ్వాళ అనుకోని పరిచయాలు కలుగుతాయి అన్న జోస్యం చూసి అది నిజమవుతుందేమో అని లేడీస్ హాస్టల్ మీదుగా వచ్చాడు... గూగుల్ వాళ్ళ సమాచారం ఇంకా వీళ్లకు అందలేదనుకుంటా... అని సరిపెట్టుకొని... బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజు చూసిన వాడిలా మొహం వాడేసుకోని జ్యూస్ సెంటర్ చేరాడు.
అలా జ్యూస్ తాగుతూ ఆలోచిస్తూ ఉండగా ఎక్కడినుంచో “ఆవారా హున్.. ఆవార హున్....” అంటూ పాట వినపడింది. ఎవడో ఆవారా గాడు అనుకుంటూ చుట్టూ చూశాక అర్థం అయింది అది వాడి మొబైల్ రింగ్ టోనే అని. ఏదో తెలియని నెంబరు కావడంతో ఫోన్ ఎత్తి హలో అన్నాడు. అటు వైపు ఒక నాజూకైన స్వరం పలికింది. “హలో... సర్ నేను ఐసిఐసిఐ నుంచి మాట్లాడుతున్నాను.. మీకు లోన్ ఏమైనా కావాలా...??”. అసలే గూగుల్ చేతిలో మోసపోయి ఉన్నాడేమో ఆ బాధ మా వాడిలో కోపం గా రూపాంతరం చెందింది. “మీకు అసలు నా నెంబర్ ఎవరు ఇచ్చారు?” అన్నాడు. “మాకు ఒకడు ఇచ్చేదేంటి సార్ మేమే తీసుకుంటాము.. ఇంతకీ మీకు లోన్ కావాలా వద్దా..??" వీళ్ళు అప్పు ఇవ్వడానికి చేశారో.. వసూలు చేయడానికి చేశారో.. అర్ధం కాక ఒక సెకను (అలియాస్ ఒక్క నిముషం) ఆలోచన లో పడ్డాడు. మొత్తానికి తేరుకొని.. “ఉప్పు లేక పోతే పప్పు చప్పగా తినచ్చు గాని అప్పులు చేసి ముప్పులు తెచ్చుకునే తప్పులు చెయ్యద్దన్నారండి నాన్నగారు...!!!” “…. సార్ కొంచెం తెలుగు లో చెబుతారా ??” ఇంకమా వాడికి చిర్రెత్తుకొచ్చి.. చంటబ్బాయి లో చిరంజీవి లా... “వద్దు.. వద్దు.... వద్దు.... వద్దు..... “ అని అరిచాడు.. రెండో సారి వద్దు చెప్పేసరికే ఫోన్ కట్ చేసిన సంగతి అర్ధమయ్యి.. నిదానించాడు. షాప్ వాడు వీడి అరుపులు విని తీసుకు వచ్చిన జ్యూస్ ని తీసుకువెళ్లిపోయాడు. మళ్ళీ వాడిని ఏదోలా బతిమాలి తీసుకొని తాగి అలవాటు గా 500 నోటు ఇచ్చాడు. షాప్ వాడు కూడా పై నుంచి కిందకు ఒక చూపు చూసి (అలవాటు గా) account లో రాసుకున్నాడు.

అక్కడ నుంచి బయలుదేరుతుండగా “ఆవారా హున్..” పాట మళ్ళీ వినిపించింది. (మీకు చెప్పక్కరలేదు కదా పాట ఎక్కడి నుంచి వచ్చిందో!!).. మళ్ళీ తెలియని నెంబరు.. మనకు తెలియని నెంబర్లకు మన నెంబరు మాత్రం ఎలా తెలుస్తుందో ఆలోచించబోయి.. ఆగి.. ఫోన్ ఎత్తాడు.
అటు : “హలో!!..నేను...”
ఇటు : “హలో!! ఎవరు.. సరిగ్గా వినిపించడం లేదు “
అటు : “హలో నవీన్.. నేను సింధూని !!!”
ఇటు : “ఎవరూ?? !!”
అటు: “నేను సింధూని.. తిరుపతి లో నేను మీ పక్క ఇంటిలో వుంటాను.. “

ఫ్లాష్ బ్యాక్ లో మన నవీన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఓర చూపులు చూశాడు లెండి.. (అంత కంటే ఏమీ చేసే ధైర్యం చాలక.. ) కానీ ధైర్యశాలి అయినా తమ్ముడు ఉండటం వల్ల ఆ అమ్మాయి ఇంజనీరింగ్ చేసి బెంగళూరు లోనే ఉద్యోగం చేస్తోందని తెలుసుకోగలిగాడు.

ఇటు: “ఎవరు మీరు నిజం చెప్పండి...”
అటు: “నేను సింధూని.. మీ పక్క ఇంటి లో వుండే అమ్మాయిని..”
మా వాడి క్రిమినల్ మెదడు ఆలోచించడం మొదలు పెట్టింది.. అసలు ఈ అమ్మాయి గురించి మా ఫ్రెండ్స్ ఎవరికి చెప్పలేదు.. (నిజానికి చెప్పిన విషయం గుర్తు లేదు...) ఎవరో ఆట పట్టిస్తున్నారా అన్న అనుమానం వచ్చింది...
ఇటు: “మీరు ఎవరో నిజం చెప్పండి... నా నెంబరు ఎలా వచ్చింది మీ దగ్గరకు ??”
అటు: “ నేను నిజం గానే సింధూని. మా ఫ్రెండ్స్ మీ కాలేజీ చూడాలనుకుంటున్నారు... అందుకని మీ నాన్న గారి దగ్గర ఈ నెంబరు తీసుకున్నాను...”

మా వాడు కచ్చితంగా ఇది నిజమైన కాల్ అని పూర్తిగా నమ్మేశాడు.. కారణం ఆడపిల్లలు ఏదో ఒక పని లేకుండా చెయ్యరు.. అనే వాడి లాజిక్.. (లాజిక్ బానే వుంది కానీ పాపం వాడి టైమే..).. నిజానికి తను కాలేజీ కాదు వాడిని చూడటానికే రావాలనుకుంటుందని మా వాడు కనిపెట్టేశాడు, పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పాడుగా ఆడువారి మాటల గురించి...

అంతలో airtel అనే గ్రహానికి వాడు శాంతి చేయించడం మరిచిపోవడం వల్ల ఆ కాల్ కట్ అయ్యింది..
రెండు యుగాలు (మనకి నిముషాలు) గడిచాక మళ్ళీ ఆవారా రాగం వినిపించింది అదే నెంబర్ నుంచి...
మా వాడు అత్యుత్సాహం తో వెంటనే “ఆ చెప్పు సింధు.. !!! “ అన్నాడు. అటు నుంచి ఏవో నవ్వులు వినిపించాయి. నా రాణిని చెలికత్తెలు ఆట పట్టిస్తున్నట్లున్నారు అని మా వాడు మురిసిపోయాడు.
అయినా ఏ మూలనో ఉన్న పెనుభూతం వల్ల “నువ్వు ఎక్కడ వుంటున్నావు?? “ అని అడిగాడు. అటు నుంచి చిన్న తటపటాయింపు తరువాత, “మారతాహళ్లి” అంది. మా వాడికి తెలిసిన software engineers అందరూ అక్కడే వున్నారు.. ఈ అమ్మాయి కూడా అదే పేరు చెప్పడం తో ఇంక ఆ భూతాన్ని భూమి లో కిలోమీటర్ లోతున పాతి పెట్టేశాడు.
అటు: “మీ కాలేజీ చూడటానికి ఎప్పుడు కుదురుతుంది ??”
ఇటు: “మీరు ఎప్పుడంటే అప్పుడే.. మా కాలేజీ లో నేను చెప్పిందే వేదం..!! “ (గమనించారా మా వాడు build up లు ఇవ్వడం మొదలు పెట్టేశాడు )
అటు: “అయితే రేపు రావచ్చా??
ఇటు: “తప్పకుండా.. అయినా రేపు శుక్రవారం కదా!! మీకు శెలవా?? “
అటు: “ఓ సారీ... మీ తో మాట్లాడుతుంటే అన్నీ మర్చిపోతున్నాను!!“
అయిపోయింది.. ఈ డైలాగ్ కి మా వాడి దిమ్మ తిరిగి పోయింది.. doubt లేదు.. ఈమె నా జీవిత భాగస్వామి.. బెంగళూరు లో తక్కువ రేటు కి ఎక్కువ చదువు చెప్పే మంచి స్కూల్ ఏంటో కనుక్కోవాలి.. మా పిల్లల్నిచేర్చేందుకు... అంటూ ఆలోచించడం మొదలు పెట్టేశాడు.. (ఆలు లేదు చూలు లేదు.. కొడుకు స్కూలు St Joseph’s అనే సామెత ఏమైనా గుర్తుకు వచ్చిందా మీకు... మీ తప్పు లేదు..)
అటు: “ఈ శనివారం మీ కాలేజీ కి వస్తాం అయితే.. సరేనా.. ఉంటాను..”
నో నో నో... ఈ అమ్మాయి ఫోన్ పెట్టేస్తోంది.. తన మనసులో మాట బయట పెట్టకుండానే.. మా వాడి హృదయం భాధ తో మూలిగింది.. ఎలాగైనా ఆపాలి...
ఇటు: “ఆ సింధు...”
అటు: “ఆ.. ఏంటి?”
ఇటు: మనసు లోని ప్రేమనంతా రంగరించి “all of a sudden గా ఎందుకిలా??”
ఇంక నవ్వు ఆపుకోవడం మా వల్ల కాలేదు... ఫోన్ కి అటు వైపు వున్న మేము.. కాల్ కట్ చేసి కిందా మీదా పడి నవ్వాం.. నిజానికి ఈ ఫోన్ చేసింది మా లో మిమిక్రీ వచ్చిన ఒక అబ్బాయి. ఆ అబ్బాయి కొత్త ఫోన్ తీసుకున్న విషయం.. వాడికి మిమిక్రీ వచ్చిన విషయం మా నవీన్ కి తెలియకపోవడం మాకు కలిసొచ్చింది. శనివారం గేట్ దగ్గర ఎదురు చూస్తున్న మా నవీన్ కి మా entry చిన్న హార్ట్ ఎటాక్ నే ఇచ్చింది. అయినా తేరుకొని మా నవ్వుల తో వాడి నవ్వు కలిపేశాడు.. (ఏడవలేక)..

నా తొలి టపా..

గమ్యం ఎరుగని నా ప్రయాణానికి సంకేతం చిరునామా లేని నా ఈ టపా...